నందమూరి తారకరత్న అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ తిట్టుకునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు చంద్రబాబు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి.. విజయసాయిరెడ్డికి వరుసకు కూతురు అవుతారు.
తారకరత్న భౌతికకాయానికి చంద్రబాబు దంపతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాబు.. తారకరత్న మృతి చాలా దురదృష్టం.. బాధాకరమని అన్నారు. ఆయన కోలుకుని మళ్లీ వస్తారని ఆశించామని చెప్పారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారని తెలిపారు.
చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోందన్నారు చంద్రబాబు. సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి అని.. ఒకేరోజు 9 సినిమాలకు ప్రారంభించిన రికార్డ్ ఆయనకే దక్కిందని గుర్తు చేశారు. రాజకీయాలపట్ల ఆలోచన ఉన్న వ్యక్తి అని.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారని తెలిపారు.
తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు. తారక రత్నను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఎన్ని చేసినా భగవంతుడు సహకరించలేదని అన్నారు.