ఒక ఉన్మాది పాలనలో ఏపీ ప్రజలు నలిగిపోతున్నారని విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గిని మాట్లాడారు. ఏపీలో దద్దమ్మ పాలన సాగుతోందని విమర్శలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే.. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్ట్ లు చేయిస్తున్నారని ఆరోపించారు. కబ్జాలు, దోపిడీలతో పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.
మహానాడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని.. ఇది తెలుగువారి పండుగ అని అన్నారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా ముందుకు పోతారనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రాబందుల పాలనలో రాష్ట్రం మూలుగుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ పోరాడుతోందని తెలిపారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపైనే పోరాటం చేసేందుకు టీడీపీ ముందుకు వెళ్తోందని తెలిపారు.
వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. అరెస్ట్ లు జరిగిన ప్రతీ సారి తాను నిద్రలేని రాత్రులను గడిపానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్, పన్నులు, ధరలు ఇలా ప్రతి దానిపై జనాలను బాదుతున్నారని మండిపడ్డారు. ఇసుక, సిమెంట్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విరుచుకుపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో సంక్షేమం అనేది ఒక బూటకమని చెప్పారు. అమ్మ ఒడి అని.. నాన్న బుడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని ద్వజమెత్తారు. పెట్రోల్ ధరలను కేంద్రం తగ్గించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని వారిని ఇలా క్షోభ పెడుతున్నావని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రోజే రాష్ట్రం బాగుపడుతోందని ప్రజలకు తెలిపారు చంద్రబాబు.