గుంటూరు: మెఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబు అడ్డుపడటం వల్లనే ఆయన్ని తప్పించారని టీడీపీ నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రోకోలో భాగంగానే పొలవరం ప్రాజెక్టుకు గతంలో ఎక్కువ ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేసిందని అన్నారు. పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారని, 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500 కోట్లు నష్టం చేకూర్చారని దుయ్యబట్టారు. ప్రజల్ని మభ్యపెట్టి దోచుకోటానికి శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ఏ ప్రభుత్వమూ అతి తక్కువ కాలంలో ఇంత అప్రతిష్ట పాలు కాలేదని, రాష్ట్రంలో పాలన ఎలా సాగుతోందో ప్రజలకు అర్ధమయ్యేలా పెద్దఎత్తున ప్రచార ఉద్యమాన్ని చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ సిద్దంగా వుండాలని పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. కావాలని మనపై బురద చల్లాలని చూసి ఆ బురద జగనే పూసుకుంటున్నాడని, పీపీఏలపై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖలే దీనికి ఉదాహరణలని అన్నారు. వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదని, ప్రయివేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా వారికి అనుమతివ్వటం లేదని గోదావరి విషాదంపై మాట్లాడుతూ చెప్పారు. ‘మరోపక్క ఇసుక పరిస్థితి దారుణంగా ఉంది. ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలమయం చేస్తున్నారు..అన్నింటిపైనా గట్టిగా పోరాడదాం’ అని చంద్రబాబు శ్రేణులతో చెప్పారు.