ఏపీలో ఏం జరిగినా టీడీపీ నాయకులకే ముడిపెడితే ఎలా అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి పేర్ని నానిపై దాడికి, తమ పార్టీకి సంబంధం ఏమిటని నిలదీశారు. కావాలనే ఆ కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. తప్పుడు కేసులతో పెట్టి మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీసీలపై ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.
మంత్రిపై దాడికి పాల్పడిన వ్యక్తిని విచారిస్తే ఎవరు అడ్డుకుంటారని.. నిజానిజాలు నిర్దారించిన తర్వాత విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.