ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏలూరులో వింత వ్యాధితో జనం అల్లాడుతున్నారని, వందలాది మంది ఆసుపత్రిలో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు ఉన్నాయని.. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడం ఆందోళనకరంగా ఉందన్నారు. సురక్షిత తాగునీరు పొందడం ప్రజల పౌరహక్కు అని.. తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యమని లేఖలో పేర్కొన్నారు.
ఏలూరు ఘటనకు సంబంధించిన కారణాలన్నింటిపై విచారణ జరగాలని, బాధిత ప్రజల వివరాలు సేకరించి… వారికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. తాగునీటిలో లెడ్, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నాని, గర్భిణులు, చిన్నారులు, వృద్దుల ఆరోగ్యంపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్న కనీసం ఆలోచన కూడా చేయలేదన చంద్రబాబు, తక్షణమే బాధితుల కోసం స్పెషల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి లక్షణాలున్న రోగులందరికి అత్యుత్తమ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి… సురక్షిత మంచి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.