మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకునేందుకు మినహా అమరావతి సోదిలోనే లేకుండా పోయింది. ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఇంటర్నేషనల్ సిటీలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తున్నామని పదేపదే అదేపనిగా అప్పట్లో చెప్పుకునేవాడు చంద్రబాబు. పాపం ఆయన ఆశల్ని గల్లంతు చేస్తూ అమరావతి మరోసారి కాలగర్భంలో కలిసిపోతోంది. అమరావతి పేరు అచ్చిరాదని చెబుతున్నా వినకుండా మా రామోజీరావు గారు చెప్పారంటూ పెట్టిన పేరే ఇప్పుడు శాపమై కూర్చుంది. ఇలావుంటే, ఎక్కడకు పోయినా చంద్రబాబు అమరావతి ప్రస్తావన తీసుకురాకుండా వదలడం లేదు. చివరాఖరికి ఫ్లయిట్లో కూడా అమరావతి గురించే కబుర్లు. పక్కన ఎవరు కూర్చున్నారనేది ఆయనకు అనవసరం. ఫిలిం స్టార్ అయినా, క్రికెట్ స్టార్ అయినా ఎవరైనా పర్లేదు.
వినేవాడు అంటూ ఒకడుంటే.. చెప్పేవాడు చంద్రబాబు అవుతాడని యూత్ సరదాగా జోకులేసుకుంటుంటుంది. వాస్తవం కూడా అదే. వినేవాడు ఎవరైనా పక్కన కూర్చుంటే చంద్రబాబు చెప్పుకుంటూ పోతాడు. అది నాన్ స్టాప్ ప్రవాహం.
అందునా.. అమరావతి ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతికి ఓ షేప్ తీసుకొచ్చేవాడే. కానీ, దురదృష్టం వెంటాడింది. జగన్, బొత్స సత్తిబాబు రూపంలో తరుముకుంటూ వచ్చింది. ఇప్పుడు అమరావతి పేరే ఎక్కడా వినిపించకుండా పోయింది. ఆ బాధ చంద్రబాబు గుండెలో గూడు కట్టుకుని వుండిపోయింది. అప్పుడప్పుడు గుండె లోతుల్లోంచి పెల్లుబికి వస్తుంటుంది. ఎవరైనా కనిపిస్తే.. గొంతు దాటి తన్నుకుంటూ బయటికొస్తుంటుంది. ఈసారి పాపం కపిల్ దేవ్ ఫుల్లుగా దొరికిపోయాడు.
అసలేం జరిగిందంటే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఫ్లయిట్‌లో పక్కపక్కనే కూర్చుని సీరియస్‌గా కబుర్లు చెప్పుకోవడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. వారి మధ్య దొర్లిన ఆ కబుర్లు ఏమిటా అని వీడియోలో ఆడియో పెంచి వింటే తీరా తెలిసిందేంటంటే చంద్రబాబు అమరావతి గురించి ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. కపిల్ దేవ్ వింటూ ఊకొడుతున్నాడు. ఏపీ నుంచి హైదరాబాద్ జర్నీలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. కపిల్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీకి వచ్చి తిరుగు ప్రయాణంలో ఇలా అమరావతి కబుర్లకు బలయిపోయారు.