ప్రశాంతమైన గ్రామాల్లో వైసిపి దౌర్జన్యకాండపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసిపి నాయకుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు కోరారు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ పంచాయితీ ఎన్నికల్లో వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ఉద్రిక్తతలు సృష్టించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు, ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడుల స్వగ్రామం నిమ్మాడ టిడిపికి కంచుకోట. అలాంటి ప్రశాంతమైన గ్రామంలో వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూడటం హేయమన్నారు.
దీనిపై ఎన్నికల సంఘం అదనపు డిజి సంజయ్ కు, విశాఖ డిఐజి రంగారావు చంద్రబాబు ఫోన్ చేశారు. పంచాయితీ ఎన్నికల్లో వైసిపి చేస్తున్న హింసా కాండపై ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే జోక్యం చేసుకుని నిమ్మాడలో ప్రశాంతత కాపాడాలని కోరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పెరియంబాడిలో టిడిపి ఎమ్మెల్సీ దొరబాబు వాహనం ధ్వంసం చేయడాన్ని, గ్రామంలో టిడిపి శిబిరంపై దాడి చేయడాన్ని, నిమ్మాడలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంపై అదనపు డిజి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెరియంబాడిలో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.