వికేంద్రీకరణే తమ లక్ష్యమని మూడు రాజధానులపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వడంతో మీడియా ముందుకొచ్చారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. జగన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో మూడు రాజధానుల ముచ్చట తెచ్చి మూడు ముక్కల ఆటకు మళ్లీ శ్రీకారం చుట్టారని ఎద్దేవ చేశారు.
ఆనాడు ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులపైనే ముందుకు వెళ్లాలనుకుంటే అదే అంశంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. భావితరాల భవిష్యత్ పై ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అమరావతిపై ప్రేమ ఉంటే ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా అని.. మంచి మనసు కూడా ఉండాలన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వితండవాదన చేస్తోందని.. రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాన్ని చేయలేరని తెలిపారు. అయినా.. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తప్పేముందని ప్రశ్నించారు చంద్రబాబు.
రాజధానిపై హైకోర్టు మాటల్లో తప్పేమందున్నారు. కోర్టు తీర్పులపై ఈస్థాయిలో మాట్లాడిన ముఖ్యమంత్రిని గానీ, మంత్రులను గానీ గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని వివరించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉందన్నారు.
తాము చెప్పిందే వేదం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. నాటి సభలో వైసీపీ కూడా అమరావతిలో రాజధాని నిర్మాణానికి అంగీకరించిందని.. ఇప్పుడు చెబుతున్న మాటలే.. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని నిలదీశారు చంద్రబాబు. తమ ఇష్టప్రకారం చట్టాలు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదని.. జనాల ప్రాణాలు తీసే చట్టం చేస్తామంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.