నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశం పార్టీ దూరం ఉండాలని నిర్ణయించుకుంది. ఆ రోజు ఖర్చులు అమరావతి పరిరక్షణ సమితి జెఏసిలకు విరాళంగా ఇవ్వాలని ఎవరూ బొకేలు, కేక్ లు తీసుకు రావద్దని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. రాజధానికి భూములిచ్చిన రైతులకు, పనులు కోల్పోయిన కూలీలకు ఆ రోజున అందరూ సంఘీభావంగా నిలబడాలి. గ్రామాల్లో పర్యటించి రైతులు, రైతు కూలీల కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని రాజధానిలో వేలాది రైతు కుటుంబాలు, మహిళలు రోడ్లపై ఉన్నారు. వాళ్ళ ఆవేదన అందరూ అర్ధం చేసుకోవాలి. భూములిచ్చిన రైతులకు రాష్ట్రంలోని రైతాంగం మద్దతుగా నిలవాలి. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న మహిళలకు రాష్ట్రంలోని మహిళలంతా అండగా సంఘీభావం చూపాలి. న్యూ ఇయర్ వేడుకలకు పెట్టే ఖర్చును రైతుల కోసం ఉద్యమిస్తున్న జెఏసిలకు విరాళంగా ఇవ్వాలి.
రాజధాని ప్రాంత రైతుల సమస్య కొన్ని గ్రామాలదో, 2జిల్లాలదో కాదు, మొత్తం రాష్ట్రం సమస్య. అందుకే దీనిని జాతీయ విషాదంగా సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రపంచానికే ఒక నమూనాగా అప్పట్లో స్వామి అంక్లేశ్వర్ అయ్యర్ తదితర ప్రముఖులంతా అన్నారు. అలాంటిది భూములిచ్చిన రైతులనే రోడ్డెక్కిస్తే భవిష్యత్తులో ఎవరూ భూములు ఇవ్వరు. ఇది సమాజానికి మంచి సందేశం కాదు. అభివృద్దికి ఇది సంకేతం కాదు.మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు ముందుకొచ్చి రైతులకు, మహిళలకు అండగా ఉండాలి, ఆయా కుటుంబాలకు సంఘీభావంగా నిలబడాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.