సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు చూశాక సీఎం జగన్‌కు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో టీవీలు పగులుతున్నాయని అంతా చెప్పుకుంటున్నారన్నారు.
అధికారం ఉందని జగన్ విర్రవీగాడని ఆయన అన్నారు. అహంకారంతో ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఇప్పుడు జగన్ పని గాలి తీసిన బెలూన్ లా అయ్యిందన్నారు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచేవాడు నాయకుడు కాలేడన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని పేర్కొన్నారు. జగన్ నియోజకవర్గంలో కూడా టీడీపీ జెండా ఎగిరిందన్నారు. సైకో పోవాలి… సైకిల్ రావాలనే నినాదం రాష్ట్ర మంతటా మారుమోగుతోందన్నారు.
సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మొన్న చదువుకున్న వాళ్లు తమ పార్టీకి ఓటేయలేదని సజ్జల అన్నాడన్నారు. మరి నిన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయలేదని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు రావడాన్ని దేవుడి స్క్రిప్ట్ అని జగన్ ఎద్దేవా చేశాడన్నారు.
మరి, నిన్న 23 ఓట్లతో, 2023లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడం కూడా దేవుడి స్క్రిప్టేనన్నారు.
అధికారంలో ఉన్నవారు హుందాగా, గౌరవంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నారు. అబద్ధాలు, అసత్యాలతో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని ఆయన ఫైర్ అయ్యారు.
జగన్ సీఎం అయ్యాక తొలి రోజు అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ…ఒక పార్టీ నుంచి ఎవరైనా మరో పార్టీలో చేరితే ఆటోమేటిగ్గా వారు డిస్ క్వాలిఫై అయ్యేలా చేయాలని అన్నారని చెప్పారు. అదే వ్యక్తి టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని చేర్చుకున్నాడన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీకి అర్హతే లేదని చెప్పాడన్నారు. మరి ఇప్పుడు 23 ఓట్లతో టీడీపీ విజయం సాధించిందన్నారు.
పట్టభద్రులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ పై తిరుగుబాటు చేశారన్నారు. ఇప్పుడు వీచింది చిన్నగాలేనన్నారు. భవిష్యత్ లో టీడీపీ సునామీ దెబ్బకు వైసీపీ కొట్టుకుపోతుందన్నారు.
మరోవైపు బాణ సంచా కాలుస్తుండగా టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీనిపై ఆయన స్పందిస్తూ… మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించానన్నారు. కార్యకర్తలు ఉత్సాహంతో బాణసంచా కాల్చారని, నలుగురుకి గాయాలయ్యాయని వెల్లడించారు. తమ కోసం వచ్చినవారికి అలా జరగడం నిజంగా చాలా బాధగా ఉందన్నారు.