ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై టీడీపీ ఆందోళనను ఉదృతం చేస్తోంది. రేపు ఉదయం 8 గంటల నుంచి విజయవాడలోని ధర్నా చౌక్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపడుతున్నారు. దీక్షా శిబిరం ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప మాట్లాడుతూ..ప్రతి ఏటా గోదావరి, కృష్ణా నదులకు వరదలు వస్తాయని…టీడీపీ హయాంలో ఏనాడు ఇసుకకు కొరత లేదన్నారు. దీక్షకు రాజకీయ పార్టీలు, భవన కార్మిక సంఘాల మద్దతు కోరామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలకు ఇసుక కోసం తమ పార్టీ ముందు నుంచి పోరాడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం లారీ ఇసుకను ౩ వేలకు ఇస్తే వైసీపీ ప్రభుత్వం అదే లారీ ఇసుకను 40 వేలకు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను ఆదాయ వనరుగా చూడొద్దని ప్రభుత్వాన్ని ఉమా కోరారు. ఇసుకపై మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాన్ ఇసుకపై లాంగ్ మార్చ్ చేయడంతో ప్రభుత్వంలో వణకు మొదలైందన్నారు బోండా ఉమా. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించాలని..కార్మికులకు ఉపాది కల్పించాలని డిమాండ్ చేశారు. రేపటి దీక్షకు మద్దతు నివ్వాల్సిందిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు కోరారు.