ఆంధ్రప్రదేశ్ లో ఆరు నెలల పాలనపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనన్నారు. నెలకు సుమారు మూడున్నర వేల కోట్లు చొప్పున అప్పులు తెచ్చారని ఆరోపించారు. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని విమర్శించారు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానంటూ.. తనపైనే ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలని… అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న జగన్ ..రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని ట్వీట్ చేశారు. విధ్వంసంతో ప్రారంభమైన జగన్ పాలనలో.. రాష్ట్రాన్ని సూసైడ్‌ప్రదేశ్‌గా మార్చారన్నారు. ఎన్నికల ముందు నవరత్నాలు ఇస్తానన్న జగన్.. ఆరు నెలల్లో మాటమార్చి ప్రజల నెత్తిన తైలం రాశారని లోకేష్ ట్వీట్ చేశారు.