మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆయనపైన నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు.. చిత్తూరు పోలీసులు నారాయణ సతీమణికి ఇచ్చిన ప్రతిని లేఖకు జతచేశారు. రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా నారయణను అరెస్టు చేశారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు మాదిరిగా నారాయణను హింసించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రఘురామరాజు అరెస్ట్ సమయంలో జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని వివరించారు.
చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అంటూ.. లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకొని నారాయణ ప్రాథమిక హక్కులకు రక్షణగా నిలవాలని అభ్యర్థించారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై జోక్యం చేసుకుని.. నారాయణకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా.. నారాయణ అరెస్ట్ తర్వాత చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో నారాయణను అరెస్టు చేయడానికి సీఎం జగన్ సకల ప్రయత్నాలు చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికే నారాయణను అరెస్టు చేశారంటూ విమర్శించారు చంద్రబాబు.