వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో రాక్షసులు, ఉగ్రవాదులను మించిన పాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్పంచ్ ల అవగాహనా సదస్సులో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్పంచ్ లకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని.. వాటిని కాలరాయడానికి అధికారాలను తీసుకోవడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు చంద్రబాబు. సర్పంచ్ లకు అధికారం లేకుండా చేశారని మండిపడ్డారు. హక్కుల కోసం వారు చేసే పోరాటానికి టీడీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయొద్దని వైసీపీ హుకూం జారీ చేసిందన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తెలుగుదేశం తరఫున బరిలోకి దిగిన నేతలు పోరాటం సాగించి గెలిచారని కొనియాడారు.
టీడీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు స్వర్ణయుగంగా ఉండేదన్నారు చంద్రబాబు. అదే జగన్ పాలనలో అస్తవ్యస్థంగా తయారయ్యిందని మండిపడ్డారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేశారని విమర్శించారు.