విశాఖలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. విశాఖలో వైసీపీ సర్కార్ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గమని అభిప్రాయపడ్డారు.
పవన్ బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు చంద్రబాబు. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని ఖండించారు చంద్రబాబు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని అడిగారు.
ఇటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పోలీసుల చర్యలను తప్పుబట్టారు. జనసేన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ చర్యను బీజేపీ సహించదని.. విశాఖలో పవన్ కార్యక్రమం చాలా రోజుల ముందే ఖరారయ్యిందని గుర్తు చేశారు. పోలీసులు అతి ఉత్సాహంగా ప్రవర్తించారన్న ఆయన.. ఒక పార్టీ అధ్యక్షుడిని టచ్ చేసి కారులో కింద కోర్చోమనడం సహించరానిదన్నారు సోము వీర్రాజు.
జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్ శనివారం విశాఖ వెళ్లారు. జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి హోటల్ వరకు ర్యాలీ సాగింది. అయితే.. మార్గమధ్యంలో పోలీసులు పవన్ ను ఆపి.. అభివాదం చేయొద్దు.. కారులో కూర్చోండని చెప్పారు. దీనిపై జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే.. పవన్ హోటల్ చేరాక.. జనసేన కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. అప్పటికే వైసీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు దీనంతటికి జనసేన నేతలే కారణమని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.