– ఏపీ పాలిటిక్స్ పై తెలంగాణలో స్కెచ్
– మరోసారి కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
– 2024 వ్యూహం అమలవుతున్నట్టేనా?
– టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనట్టేనా..?
– పైకి.. జీవో నెంబర్ 1పై చర్చ అంటూ ప్రకటన
– పొత్తులపై చర్చలుంటాయని స్పష్టం
– టీడీపీ, జనసేన కలయిక.. ఏం జరగబోతోంది..?
– ఒకవేళ.. అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది..?
– కాపుల కల నెరవేరుతుందా..?
– పవన్ ను చంద్రబాబు సీఎం చేస్తారా?
– 50-50 ప్లాన్ అమలు అవుతుందా..?
ఏపీలో కుల సమీకరణాలతో రాజకీయాలు నడుస్తుంటాయి. అందుకే.. అక్కడి పాలిటిక్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. అయితే.. వేర్వేరు దారుల్లో వెళ్తున్న ఈ పార్టీలు ఒకే బాటలో నడిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉందని రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కీలక అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పైకి.. ఇది జీవో నెంబర్ 1పై చర్చల్లో భాగంగా జరిగిన భేటీ అని చెబుతున్నారు. కానీ, రాజకీయ పండితులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి ఉంది. కేంద్రంలోని బీజేపీకి దగ్గరగా ఉంటోంది ఈ పార్టీ. రాష్ట్ర బీజేపీ నేతలు దీన్ని ఖండిస్తున్నా.. అనేక అనుమానాలున్నాయి. ఇదే సమయంలో జనసేనతో తమకు పొత్తు ఉందని చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అంత ఆసక్తి లేదనేది విశ్లేషకుల వాదన. మొన్నామధ్య ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనకు వచ్చినప్పుడు పవన్ కలిశారు. ఈ మీటింగ్ టాక్స్ పై ఎలాంటి లీక్స్ ఇవ్వలేదు. ఏం జరిగిందో? దేనిపై మాట్లాడుకున్నారో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. అనూహ్యంగా ఆ సమయంలో పవన్ ని కలిశారు చంద్రబాబు. దీంతో పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఆనాడు పవన్ టూర్ పై ఆంక్షలను ఖండిస్తూ చంద్రబాబు వెళ్లి కలిస్తే.. ఇప్పుడు చంద్రబాబు టూర్ పై ఆంక్షలను ఖండిస్తూ పవన్ కలిశారు. ఈ సందర్భంగా బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి జీవో నెంబర్ 1పై చర్చించామని.. ఎన్నికలు, పొత్తులపై తర్వాత మాట్లాడుకుంటామన్నారు. అన్ని పార్టీలు, సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటామని.. 2009లో టీఆర్ఎస్ తో కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ముందు పొత్తు పెట్టుకున్నా ఆ తర్వాత విభేదించామని వివరించారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయని తెలిపారు చంద్రబాబు. అంటే.. జనసేనతో ముందు పొత్తు పెట్టుకున్నాం.. తర్వాత విభేదాలు వచ్చాయి.. ఇప్పుడు మళ్లీ కలుస్తాం అనేలా హింట్ ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ, జనసేన కలిస్తే.. వైసీపీని గద్దె దించడం పెద్ద కష్టమేం కాదనేది విశ్లేషకుల వాదన. 2014 ఎన్నికల్లో జరిగిన ఉదాహరణలు, 2019లో టీడీపీ, జనసేనకు వేర్వేరుగా వచ్చిన ఓట్లను పోల్చి చూస్తే.. వైసీపీ వాటి వెనకే ఉంటుందని అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి గెలిచినా.. సీఎం కుర్చీ ఎవరిదనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే.. జనసేనకు కాపుల బలం ఎక్కువ. కులం కార్డు వద్దని పవన్ కళ్యాణ్ చెబుతున్నా.. పార్టీకి అధికంగా వెన్నుదన్నుగా ఉంది కాపులే. ఉండటానికి అత్యధికంగా ఉన్నా కూడా కాపులకు అధికారం దక్కలేదు. ఆనాడు వంగవీటి రంగా రూపంలో ఓ ఆశ కలిగినా.. ఆయన్ను హత్య చేయడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత కాపులు పార్టీల వారీగా చీలిపోయి తలోదిక్కు అయ్యారు. 2009 సమయంలో చిరంజీవి వచ్చినా తొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కాపుల్లో ఓ ఆశ ఉంది. తమ వర్గం నాయకుడు సీఎం కావాలనే కలను పవన్ తీరుస్తారని బలంగా నమ్ముతున్నారు. అయితే.. చంద్రబాబు ఆ ఛాన్స్ ఇస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జనసేన రెండున్నరేళ్లు, టీడీపీ రెండున్నరేళ్లు పాలన సాగిస్తే కాపుల కల కూడా నెరవేరినట్టు అవుతుందని కొందరు అంటున్నారు. ఇక్కడ ఇంకో చర్చ కూడా సాగుతోంది. టీడీపీ, బీజేపీకి గత ఎన్నికల సమయం నుంచి పడడం లేదు. ఇప్పుడు జనసేన, టీడీపీకి దగ్గరైతే బీజేపీకి దూరం అవ్వాల్సిందే. చూడాలి.. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.