ఏపీ సర్కార్ పై మండిపడ్డారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు.
రాష్ట్ర భవిష్యత్తును సీఎం అంధకారంలోకి నెట్టేశారని అన్నారు చంద్రబాబు. ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను, విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని.. ఇంకొన్ని రోజులు పోతే రోడ్లను కూడా పెడతారేమోనని చురకలంటించారు.
2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు చంద్రబాబు. ఈ ప్రభుత్వ పోకడల గురించి ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని.. చెత్త మీద కూడా పన్నులు వేస్తున్నారని ఆరోపించారు.
పోలవరంలో అవినీతి జరిగిందని గతంలో ఆరోపణలు చేసిన జగన్… ఇప్పుడు అధికారంలో ఉండి రుజువు చేయలేకపోయారని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరాన్ని 70 శాతం పూర్తి చేస్తే.. జగన్ పాలనలో పనులు ముందుకు సాగట్లేదని విమర్శించారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు లేదని సెటైర్లు వేశారు.
సినీ పరిశ్రమకు చెందినవాళ్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని.. అందులోనూ వేలు పెట్టారంటూ జగన్ పై విమర్శలు చేశారు చంద్రబాబు. సీఎంగా ఎన్నో ఏళ్లు చేశానని.. కానీ ఇవేవి తనకు తెలియదన్నారు. ఇప్పుడే నేర్చుకుంటున్నానని సెటైర్లు వేశారు. సినిమా వాళ్ల పొట్ట మీద కొట్టి భయపెట్టారని ఆరోపించారు.