గుంటూరు: కల్లా కపటం తెలియని పసి వయసులో ఒక చిన్నారి వెలివేయడం అనే అనాగరిక దౌర్జన్యాన్ని ఎదుర్కోవాల్సి రావడం సభ్య సమాజానికే సిగ్గుచేటు అని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. బడికెళ్ళే పిల్లల్లోనూ విషబీజాలు నాటే ఇలాంటి దుశ్చర్యలను అందరూ వ్యతిరేకించాలని చెప్పారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం చిన్నారి ‘కోడేరు పుష్ప’ రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు ట్విట్టర్‌లో సూచించారు.
తన ఊళ్లో వున్న దుర్భర పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించి న్యాయం చేయాలని కోరిన చిన్నారి ధైర్యాన్ని అభినందిస్తున్నానని బాబు పేర్కొన్నారు తన తండ్రి, తాతలకు ప్రాణాపాయం ఉందనే భయాన్ని ఆ చిన్నారి మనసు నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నానన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిస్సహాయంగా మారినందుకే ఈ దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని, పుష్ప కుటుంబానికి పోలీసులు తగిన భద్రత, భరోసా కల్పించడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చిన్నారి పుష్ప నిర్భీతిగా, స్వేఛ్ఛగా చదువుకోవాలి. మళ్ళీ తన స్నేహితులతో ఆటపాటలతో గడపాలి. రేపటి పౌరురాలిగా ఎదగాలి’ అని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు ఆకాంక్షించారు.