అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. పాలనలో ఏపీ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడంపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని.. దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
జగన్ సీఎం అయినంత మాత్రాన జవాబుదారీతనానికి అతీతుడా అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి ఒళ్లంతా ఇగోనే అని.. చెప్పినా అర్థం కాదని ఎద్దేవ చేశారు. జగన్ ప్రభుత్వం అసమర్థత, చేతకానితనం వల్ల 62 మంది చనిపోయారని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై జ్యుడీషియల్ విచారరణ జరిపించాలన్నారు. వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిచ్చి తుగ్లక్ మాదిరి జగన్ తయారయ్యారని విమర్శించారు.
గతంలో వరదలు వచ్చినప్పడు అన్నమయ్య ప్రాజెక్టు గేటు క్లోజ్ కాలేదని, దాంతో నీరు మొత్తం వృథాగా పోయిందన్నారు చంద్రబాబు. ఈసారి వరదలు వచ్చినప్పుడు కూడా అదే గేటు ఓపెన్ కాలేదని చెప్పారు. ఒక్క గేటుకు గ్రీసు కూడా వేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులను నిర్మిస్తారా? అంటూ సెటైర్లు వేశారు. ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్ల కోసమే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయలేదని ఆరోపించారు చంద్రబాబు.