చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు
టీటీడీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న టీటీడీకి ఇంతకుముందెన్నడూ లేనివిధంగా 81మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా చూస్తుంటే రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ధోరణే కనిపిస్తోంది. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.
టీటీడీ బోర్డు అనేది భక్తిభావం, సేవా స్ఫూర్తి ఉన్నవారితోనే ఏర్పాటు కావాలి. పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులకు చోటు కల్పించడం మంచిది కాదు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారు. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన టీటీడీ జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలి.
తిరుమల అనేది ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం. సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలి.