ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని ఆరోపించారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. నేరాలను కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో కొన్ని రోజులుగా జరిగిన హత్యలు, హత్యాచారాలు, నేరాలకు సంబంధించిన వివరాలను.. మీడియాలో వచ్చిన కథనాలను.. అందుకు సంబంధించిన వీడియోలను తన లేఖలో జత చేశారు.
అధికార మదంతో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీలను నిలువరించడంలో ఖాకీలు విఫలమవుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా జి కొత్తపల్లిలో గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో తన భర్త హత్యకు తలారీ వెంకట్రావే కారణమని గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని తన లేఖలో రాసుకొచ్చారు చంద్రబాబు. శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళుతున్న టీడీపీ నేతలపై దాడి చేయడం దారుణమన్నారు. అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోలీసులు.. విపక్ష నేతలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు.
వరుసగా జరుగుతున్న ఘటనలతో ఏపీ పరువు మంటగలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో సామూహిక అత్యాచార ఘటన జరిగేది కాదన్నారు చంద్రబాబు. అనంతపురం జిల్లాలో పెన్షన్ కావాలని అడిగిన టీడీపీ కార్యకర్తపై పోలీసు అధికారే దాడి చేశారంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కసింకోటలో పట్టపగలు తుపాకులతో బెదిరించి బ్యాంకులో దోపిడికి పాల్పడ్డారంటే.. అది ప్రభుత్వ వైఫల్యమా..? లేక పోలీసుల వైఫల్యమా..? అని నిలదీశారు.
విచ్చలవిడి అక్రమ దందాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మద్యం, గంజాయి వాడకం పెరగడం, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. మత్తు మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని తెలిసినప్పటికీ.. పోలీసులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు. శాంతి భద్రతలపై ఫోకస్ చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో డీజీపీని కోరారు చంద్రబాబు.