కందుకూరు సభా ప్రాంగణంలో జరిగిన ఘటనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. చంద్ర బాబు ఏం చేశారని,జనం అంతలా రావడానికి.. కావాలనే టీడీపీ ఇరుకు సందులో బస్సు యాత్రను పెట్టి జనాల ప్రాణాలు తీసిందని ఆరోపించారు.
పక్కనే ఆసుపత్రి లేకపోతే మృతుల సంఖ్య ఇంకా బాగా పెరిగేదన్నారు కాకాణి. ఇక మంత్రి రోజా తనదైన శైలిలో ఈ దుర్ఘటనపై స్పందించారు. కందుకూరు ఘటన బాధాకరమని చెప్పి.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం 8 మంది ప్రాణాలను బలిగొన్నాడన్నారు. ఇరుకైన ప్రదేశంలో సభను పెట్టి.. ఎక్కువ మంది ప్రజలు తన సభకు వచ్చినట్లు చూపించేందుకు చంద్రబాబు యత్నించారని దుయ్యబట్టారు. న్యాయస్థానం స్పందించి..సుమోటోగా బాబు పై కేసు నమోదు చేయాలని చెప్పారు.
చంద్రబాబుని ఏ1 ముద్దాయిగా చేర్చి..హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు రోజా. 8 మంది ప్రాణాలను బలిగొనడం.. చంద్ర బాబు రాజకీయంగా చేసిన హత్య అని ఆమె పేర్కొన్నారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు.. గాయపడిన వారికి కోటి రూపాలయ చొప్పున టీడీపీ చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ‘ కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. కందుకూరు రెవెన్యూ కాలనీ నుంచి మొదలైన ఆయన రోడ్ షో ఎన్టీఆర్ కూడలి వద్ద కు చేరుకుంది. సాయంత్రం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.