తెలుగు పాట ‘నాటు’గా కాలర్ ఎగరేసింది. నీట్ గా ఆస్కార్ కొట్టేసింది.లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభంగా జరిగిన వేడుకలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పురస్కారం దక్కింది.అనంతరం ఆస్కార్ బ్యాక్ స్టేజ్ పై ఈ పాట, సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ క్రమంలో 56 అక్షరాలున్న భాషతో ఈ పాటను ఎలా రాశారు? ఈ క్రమంలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి? అన్న ప్రశ్నకు బదులుగా తెలుగు గొప్పదనం గురించి చంద్రబోస్ అద్భుతంగా వివరించారు. తెలుగు పదాల్లోనే సంగీతం ఇమిడి ఉందన్నారు.
‘తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఎన్నో పదాలు, వ్యక్తీకరణలు, మరెన్నో భావాలతో కూడిన గొప్ప సాహిత్య, సంగీత భాష మా తెలుగు. అందుకే తెలుగులో సాధారణ పదం రాసినా అది సంగీతంలా ప్రతిద్వనిస్తుంది. ఆర్ఆర్ ఆర్ లోని నాటు నాటు పాటను తెలుగు తెలిసిన అభిమానులు ప్రేమించారు.
మా భాష తెలియని మీలాంటి పాశ్చత్య ప్రేక్షకులకు కూడా ఇంతగా ప్రేమిస్తున్నారంటే కారణం పాటలో ఉన్న శబ్దం, సంగీతమే. అదే మాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది.
ఈ పాటలో నేను రాసిన లైన్లు అన్నీ మా గ్రామంలో నాకు ఎదురైన అనుభవాలే. ఇప్పుడు నేను ఇండియా వెళ్లి ఈ అవార్డును నా భార్య, పిల్లలకు చూపించాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.