తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట – పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో మృతి చెందిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు.
అయితే నాగరాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నాగరాజును సర్పంచ్ చాణిక్య హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా పంచాయితీ పేరుతో నాగరాజును సర్పంచ్ తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా నాగరాజు తమ్ముడు పురుషోత్తంకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చాణిక్య..నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్ చాణిక్య ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్పంచ్ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా బోరున విలపిస్తున్నారు. చాణిక్య సోదరుడు వితింజయ్ భార్యతో పురుషోత్తం కు అక్రమ సంబంధం ఉంది.
ఈ విషయమై శివరాత్రి రోజు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం పంచాయితీ పెట్టించినట్లు సమాచారం. తాజాగా ఇదే విషయమై మాట్లాడాలని నాగరాజును చాణిక్య పిలిపించి దారుణానికి ఒడిగట్టాడు.