– రాహుల్, సోనియాలు కొత్త స్థానాలను వెతుక్కోక తప్పదా..?
–రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పాకులాట..
– రాయ్ బరేలీ, అమేఠీ లోక్ సభ స్థానాలపైన బీజేపీ కన్ను..
–పార్టీ పెద్దలకు తప్పని ఓటమి అనే నేతల వాదనలు నిజమేనా..?
–యూపీలో రగులుతున్న రాజకీయం..
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతోంది. గెలుపు గుర్రాలను ఎక్కేందుకు నేతలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి నేతలు ఆరాటపడుతున్నారు. అయితే.. సిట్టింగ్ స్థానాల్లో నేతలను పక్కన పెట్టి ఆ స్థానాల్లో కొత్త వారికి టికెట్ ఇచ్చే యోచనలో కొన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. కొన్ని పార్టీలు గెలుపు దీమాతో ఉంటే.. ఇంకొన్ని పార్టీలు ఓటమి భయంతో సతమతమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో పూర్వ వైభవం సంపాదించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలను సిద్దం చేస్తోంది పార్టీ అధిష్ఠానం.
అయితే.. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడం అటుంచి.. కంచుకోటగా భావించే రాయ్ బరేలీ లోక్ సభ స్థానం పరిధిలోని అయిదు అసెంబ్లీ స్థానాలను అయినా గెలిపించుకోగలదా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంపైనే దృష్టి సారించింది.అయినప్పటికీ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ పరిధిలోనైనా మెరుగైన ఫలితాలు సాధించగలరా..? అన్నదే ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకు దీటుగా బీజేపీ బలమైన క్యాడర్ తో దూసుకుపోతోంది. గెలుపుకోసం వ్వూహాలను రచిస్తూ.. రాయ్ బరేలీ స్థానం పైన కన్నేసింది. గతంలో అమేఠీలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా బీజేపీ అమలు చేస్తూ పట్టు బిగిస్తోంది. ఒక వేళ 2024 లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయాలనుకుంటే.. ఆమె రాయ్‌బరేలీకి బదులు మరో స్థానాన్ని ఎంచుకోక తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ కు వెళ్లినట్లుగానే సోనియాగాంధీ మరో రాష్ట్రం నుంచి పోటీ చేసే పరిస్థితులు రావచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీల హయాం నుంచి కాంగ్రెస్ కు ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాలు రెండు కంచుకోటలు.. ఈ రెండు స్థానాల పరిధిలో 10 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 2017 ఎన్నికలకు ముందు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి సోనియా గాంధీ, అమేఠీ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. రాయ్‌బరేలీ పరిధిలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి అదితి సింగ్, హర్‌చంద్‌పుర్ స్థానం నుంచి రాకేశ్ సింగ్ లు మాత్రమే విజయం సాధించారు. ఇటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో… అమేఠీ నుండి పోటీలో ఉన్న రాహుల్.. స్మృతీఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు మిగిలిన లోక్‌సభ స్థానం రాయ్‌బరేలీ ఒక్కటే. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అది కూడా కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో ఈ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని అయిదు శాసనసభ సీట్లపై బీజేపీ కన్నేసింది. అందులో భాగంగానే ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మను రాయ్‌బరేలీ ఇన్‌ఛార్జిగా నియమించింది.
మరో వైపు రాష్ట్రంలో కీలకం అనుకున్న నేతలు సైతం పార్టీని వీడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు బోసిపోతున్నాయి. రాష్ట్రంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ, సీనియర్ దళిత నేత పీఎల్. పునియాలు కాంగ్రెస్ ప్రచార సభల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గోండా స్థానం నుండి టికెట్ కేటాయించినప్పటికీ సవితాపాండే బీజేపీలోకి, బరేలీలో టికెట్ కేటాయించిన సుప్రియ అరోన్ సమాజ్‌వాదీ పార్టీలోకి, రాంపుర్‌లో టికెట్ వచ్చిన హైదర్ అలీ ఖాన్ అప్నాదళ్ పార్టీలోకి, సహరాన్ పుర్ లో టికెట్ వచ్చిన మసూద్ అక్తర్ సమాజ్ వాదీ పార్టీలోకి.. ఇలా టికెట్ లు కేటాయించినప్పటికీ.. అగ్ర నేతలు పార్టీ నేతలు ఇతర పార్టీలకు జారుకోవడంతో కాంగ్రెస్ లో హై టెన్షన్ మొదలైంది. మిగిలున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోనైనా కుటుంబ పట్టును కాపాడుకోగలిగితే చాలు అని సొంత పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.