వారణాసి ఎయిర్ పోర్టులో సోమవారం అనేక విమానాలు ల్యాండ్ అయి నిలిచిపోయాయి. ఏ విమానం ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడి నుంచి ఏ విమానం వచ్చిందో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. విమాన ప్రయాణికుల అవస్థలను పట్టించుకునేవారే లేకపోయారు. శీతల గాలులు, పొగమంచు వంటి వాతావరణ స్థితిలో దారి సరిగా కనిపించకపోవడంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోగా కొన్నింటిని దారి మళ్లించారు. కస్టమర్ సర్వీసు కేంద్రాల వద్ద గుంపులుగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ విమానాల గురించిన సమాచారం కోసం బారులు తీరిన దృశ్యాలు వీడియోలకెక్కాయి.
తమ ముంబై-వారణాసి విమానాన్ని రాయ్ పూర్ కి మళ్లించినట్టు విస్తారా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేయగా.. ఢిల్లీ-వారణాసి విమానాన్ని ఢిల్లీకే డైవర్ట్ చేసినట్టు సంబంధిత ఎయిర్ లైన్స్ తెలిపింది. వారణాసి ఎయిర్ పోర్టులో వాతావరణం సరిగా లేక ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.
సోమవారం ఉదయం నుంచి ఈ విమానాశ్రయంలో తన భార్య, నెల రోజుల పాప చిక్కుకుపోయారని, ఎవరైనా సాయం చేయాలని ముంబైలో ఉన్న దుర్వేష్ నాయక్ అనే వ్యక్తి దీనంగా కోరుతూ ట్వీట్ చేశారు. తన బేబీని సాధ్యమైనంత త్వరగా డాక్టర్ కి చూపించాల్సి ఉందని ఆయన అన్నారు. తన పాప ఆరోగ్యం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
అయితే ఇంకా ఇలా సాయం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికులకు కస్టమర్ సర్వీస్ సిబ్బంది కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. విమానాలతో బాటు వారణాసికి రావలసిన రైళ్లు కూడాకొన్ని గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక్కడ కనీస ఉష్ణోగ్రతలు 4.6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. వచ్చే వారం రోజులు కూడా పొగ మంచు, శీతల వాతావరణం ఉండవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.