పాకిస్తాన్ లోని పంజాబ్ అసెంబ్లీ రణరంగంగా మారింది. శాసన సభకు అధ్యక్షత వహించేందుకు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ వచ్చిన సమయంలో ఆయనపై పాకిస్తాన్ తెహ్రీ క్- ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ సభ్యులు దాడి చేశారు.
తర్వాత ఆయన్ని పీటీఐ సభ్యులు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో సభలో ఒక్క సారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది ఎదుటే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఈ ఘటన తర్వాత డిప్యూటీ స్పీకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ ఘటన నేపథ్యంలో సమావేశం ఆలస్యం అయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యుల తీరు చూసి సిగ్గుపడుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.