విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబోలో ‘జెర్సీ’ వచ్చింది. అద్భుతమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఏకంగా నేషనల్ అవార్డు సాధించింది. అలా తన టాలెంట్ నిరూపించుకున్న గౌతమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. నిజానికి ఇది రామ్ చరణ్ చేయాల్సిన సినిమా. చరణ్-గౌతమ్ మధ్య చర్చలు కూడా జరిగాయి. ప్రాజెక్టు సెట్ అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రావాల్సింది.
కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి చరణ్ తప్పుకున్నాడు. ఆ వెంటనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా లాక్ అయింది. హీరోయిన్ తో పాటు మిగతా టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.