అవకాశం వస్తే తప్పకుండా విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటిస్తానని అన్నాడు రామ్‌చరణ్. క్రీడానేపథ్య సినిమా చేయాలన్న కల చాలా కాలంగా ఉందని పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు రామ్‌చరణ్. హాలీవుడ్‌లోనూ అతడి పేరు మారుమ్రోగిపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొని చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామ్‌చరణ్ శుక్రవారం ఇండియాకు తిరిగివచ్చారు. ఓ కార్యక్రమం కోసం నేరుగా అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అతడికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ స్పోర్ట్స్ బేసెడ్ సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తోన్నానని అన్నాడు.
కానీ ఆ కోరిక మాత్రం తీర లేదని రామ్‌చరణ్ చెప్పాడు. భవిష్యత్తులో తప్పకుండా ఏదో ఒక క్రీడానేపథ్య సినిమా చేస్తానని అన్నాడు. విరాట్ కోహ్లి బయోపిక్‌పై అడిగిన ప్రశ్నకు రామ్‌చరణ్ బదులిస్తూ ఛాన్స్ దొరికితే తప్పకుండా కోహ్లి బయోపిక్‌లో నటిస్తానని అన్నాడు. లుక్ పరంగా తాను కొంత కోహ్లికి దగ్గరగా కనిపిస్తానని చరణ్ అన్నాడు.
కోహ్లి రోల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై పోషించే అవకాశం రావాలని తాను కోరుకుంటున్నట్లు రామ్‌చరణ్ చెప్పాడు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ అంటే ఇష్టమని, ముంబై ఎప్పుడూ వచ్చినా సల్మాన్‌ను కలుస్తుంటానని చెప్పాడు. బేటా అంటూ తనను ఆత్మీయంగా సల్మాన్ పిలుస్తుంటాడని రామ్‌చరణ్ అన్నాడు.