పంజాబ్ లో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ప్రచారం వాడీ వేడిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన విషయం వెల్లడించారు. పంజాబ్ సీఎం,కాంగ్రెస్ అభ్యర్థి చరణ్ సింగ్ ఛన్నీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని అన్నారు.
చరణ్ జిత్ సింగ్ ఛన్నీ ఆయన పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఓటమి పాలవుతారు. మా పార్టీ నిర్వహించిన టెలీపోల్ లో ఈ విషయం వెల్లడైంది. మూడు సార్లు నిర్వహించగా ఇదే ఫలితం వచ్చింది. ఇక చన్నీ ఓడిపోతే కాంగ్రెస్ కు సీఎం అభ్యర్థి ఎవరో మరి అని అన్నారు.
‘ ఛన్నీ సాబ్ చంకౌర్ సాహిబ్, బదౌర్ అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్నారు. కానీ ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఓటమిని ఎదుర్కోబోతున్నారు. చంకౌర్ స్థానంలో మాకు 52 శాతం ఓట్లు పడతాయి. ఇటు బదౌర్ లో 48శాతం ఓట్లు వస్తాయి.” అని అన్నారు.
పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. అయితే గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రాష్ట్రంలో అధిక సంఖ్యలో దళితులు వారణాసి వెళతారని, దీంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయాలని పలు పార్టీలు ఈసీని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదిని ఫిబ్రవరి 20కు మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.