ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తుంది. నెల రోజులకు పైగా బాంబులు, క్షిపణులు, విమానాలతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో ఉక్రెయిన్ పూర్తిగా తన రూపురేఖలను కోల్పోయింది. ఇప్పటికే కీవ్, మరియూ పోల్ పలు నగరాలు ధ్వంస మయ్యాయి. ప్రతి దానిపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు మేరకు ప్రజలు స్వచ్చందంగా మెషిన్ గన్‌లు పట్టుకుని తమ మాతృభూమి కోసం యుద్దంలో దిగుతున్నారు. కేవలం ఉక్రేనియన్లే కాదు విదేశాలకు చెందిన మాజీ సైనికులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరి యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో స్నిపర్ చార్ కోల్ అనే మహిళ యోధురాలు యుద్దంలో దిగింది. ప్రస్తుతం స్నిపర్ చార్కోల్ చర్చనీయాంశంగా మారింది.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైనికుల పాలిట సింహస్వప్నంగా మారి.. ఉక్రెయిన్ సైన్యానికే హీరోగా నిలిచి ‘లేడీ డెత్’గా గుర్తింపు పొందింది లియుడ్మిలా పావ్లిచెంకో. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఆమె స్థానాన్ని చార్కోల్ భర్తీ చేస్తోంది. ఈ యోధురాలు క్రెమ్లిన్ బలగాలను ధీటుగా ఎదుర్కొంటూ.. వీరోచితంగా పోరాటం చేస్తోంది. ముఖాన్ని మాస్క్‌తో కప్పి ఉన్న ఈ ధీరవనిత ఫోటోలను ఉక్రెయిన్ సైన్యం తాజాగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఆమె తన ముఖంపై ఆకుపచ్చ, నలుపు రంగు స్కార్ఫ్‌లను కట్టుకుంది.
చార్కోల్.. తన సోదరుడి కోరిక మేరకు 2017లో మెరైన్ సైన్యంలో చేరారు. రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు వ్యతిరేకంగా.. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో విశేష సేవలందించారు. పదుల సంఖ్యలో శత్రువులను హతమార్చారు. జనవరి 2022లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలుపెట్టడంతో వెంటనే తిరిగి విధుల్లో చేరిన చార్కోల్.. కదనరంగంలో శత్రు సైన్యాలను చీల్చిచెండాడుతున్నారు.
“అందరికీ ఆయుధాలు ఇవ్వండి! వీళ్లు మనుషులు కాదు.. ఫాసిస్టులు కూడా ఇంత నీచంగా ఉండేవారు కాదు.. ఈ పోరాటంలో తప్పకుండా గెలుస్తాం.. వ్యక్తిగతంగా నేను చివరి వరకు నిలబడతాను! ఇప్పుడు మన వాళ్లు కొందరు కళ్లు తెరిచి ఎవరో అర్థం చేసుకున్నందుకు సంతోషం” అని రష్యన్ సైనికులను ఉద్దేశించి ఆమె మాట్లాడినట్టు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక తెలిపింది.
రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ తరఫున పోరాడిన స్నైపర్ లేడీ డెత్‌తో చార్కోల్‌ను పోల్చడం విశేషం. లేడీ డెత్ లియుడ్మిలా పావ్లిచెంకో ఆ యుద్ధంలో 300 మందికి పైగా జర్మన్ సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఒడెస్సా, సెవాస్టోపోల్‌ను నాజీల బారి నుంచి కాపాడే పోరాటంలో గాయపడింది. ఆ తర్వాత యుద్ధంలో అమెరికాకు కూడా మద్దతుగా నిలిచింది. లేడీ డెత్ సేవలకు ఉమ్మడి సోవియట్ అత్యున్నత పురస్కారం ‘ది హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అవార్డ్’ వరించింది.