చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని..పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేంద్రం ప్రభుత్వాలను మారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కాంగ్రెస్ అవగాహన సదస్సులో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీల తీరు పై మండిపడ్డారు.
చైనా దురాక్రమణ పై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా వివరించారని రేవంత్ తెలిపారు. ప్రజల సమస్యలను తీర్చడానికే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. 2004 లో అధికారం వచ్చినా రాహుల్ గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని చెప్పారు. చలికి భయపడకుండా రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని కొనియాడారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదుకుందని రేవంత్ గుర్తు చేశారు.
దేశాన్ని కులం,మతం ఆధారంగా విడగొడుతున్నారని ఆరోపించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ధరణితో లక్షలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఓటరు లిస్ట్ లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేసి,వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. 2003 లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023 లో కూడా అలాంటి పరిస్థితులే రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, పీసీసీ వ్యతిరేక నేతలు అందరూ కలిసి పాల్గొనడం విశేషం.