ఈమధ్యనే అడవి మృగాల్ని కాపాడే పాత్రలో హీరోగా నటించిన మలయాళ సినీ హీరో మోహన్‌లాల్‌ను అటవీ సంపదను కొల్లగొట్టే కేసులో ఊచలు లెక్క బెట్టించడానికి అక్కడి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తీవ్రమైన అభియోగాలతో మోహన్‌లాల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు కేరళ అటవీ శాఖ మామూలుగా షాక్ ఇవ్వలేదు. సినిమాల్లో మోహన్‌లాల్ విలన్లను ఒక రేంజ్‌లో భయపెడతాడే ఆ తరహా టెర్రర్ పుట్టించారు. అతను ఇప్పుడు ఎదుర్కొంటున్నది సాధారణమైన నేరం కాదు. ఇంట్లో విలువైన అటవీ సంపదను దాచి పెట్టుకున్నారనే అభియోగం. మోహన్‌లాల్ అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అటవీశాఖ ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ చార్జ్‌షీటు నమోదు చేశారు.
కోదనాడ్ రేంజ్‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్‌లో మోహన్‌లాల్‌పై 2012లో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. మళ్లీ ఏడు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ కేసు ఛార్జిషీటు దశకు వచ్చింది. కృష్ణన్ అయ్యర్ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్ వివరణ ఇచ్చారు. ఈ అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ ఎర్నాకుళంకు చెందిన పౌలోస్ అనే పిటిషనర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. దీంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై అభియోగాలు మోపవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. 2012లో మోహన్‌లాల్ ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మోహన్‌లాల్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెషన్ 44(6) కింద కేసు నమోదు చేసి, మోహన్‌లాల్‌ను ప్రధాన నిందితుడుగా చేర్చారు.