స్మృతి మేడమ్ వేధింపుల కేసు.. ఆ నలుగురికీ చిత్తడే!

కేంద్ర మంత్రి, బీజేపీ ఫిమేల్ ఐకాన్ స్మృతి ఇరానీకీ తప్పలేదు వేధింపుల బెడద. ఆమెను వెంటాడి వేధించిన పాపానికి నలుగురు ఆకతాయిలకు ఇప్పుడు చిప్పకూడు తినే పరిస్థితి వచ్చి పడింది. వివరాలు తెలియాలంటే గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఒక ఘటనను ప్రస్తావించుకోవాలి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి చాణక్యపురి ఏరియాలోని తన ఇంటికి వెళ్తుండగా.. ఆమె కారును కొందరు కుర్రాళ్ళు వెంబడించారు. మధ్యమధ్యలో అటకాయించి కామెంట్స్ చేస్తూ వెళ్లారు. తర్వాత మేడమ్ ఆదేశాల మేరకు.. అప్పట్లో ఆ నలుగురిని పట్టుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లోపలేశారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు బెయిల్ మీద బైటికొచ్చేశారు. కానీ.. దర్యాప్తు దశలో వున్న ఆ కేసుకు ఇప్పుడు మళ్ళీ కాళ్ళొచ్చేశాయి. తాజాగా ఆ నలుగురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఖాకీలు.. మళ్ళీ వేట షురూ చేశారు. వేధింపులు, మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, దూషణ లాంటి అనేక అభియోగాలు మోపి 354 D, 509 సెక్షన్ల కింద దర్యాప్తు జరుపుతున్నారు.