ఓవైపు ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని కేంద్రంపై విమర్శలు వస్తుండగా.. ఇంకోవైపు కేసుల విషయంలో తగ్గడం లేదు. సోనియా గాంధీని ఈడీ విచారిస్తున్న సమయంలో.. కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీని సొంత సంస్థగా వాడుకుంటున్నారని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్న ఈ టైమ్ లో మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు మనీలాండరింగ్ కోర్టు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.
ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలను నమోదు చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో దాదాపు రూ.43.69 కోట్ల నిధులను ఇష్టానుసారంగా మళ్లించారని చార్జిషీట్ లో పేర్కొంది.
ఈ వ్యవహారంపై మే 31న ఫరూఖ్ అబ్దుల్లాను ఈడీ దాదాపు 3 గంటలపాటు ప్రశ్నించింది. ఈడీ చార్జిషీట్ ఆధారంగా శ్రీనగర్ లోని మనీలాండరింగ్ వ్యవహారాల కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 27న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఫరూఖ్ ను ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి ఈడీ 2020లో ఫరూఖ్ కు చెందిన దాదాపు రూ.11.86 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.21.55 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు అధికారులు.