ప్రస్తుతం ఏసీ అందరికీ ఒక కంపల్సరీ గృహావసరంగా ఉంది. కొత్త ఏసీ కొనాలంటే మార్కెట్లో కనీసం 30 నుంచి 40 వేల ఖర్చు చేయాలి. ఇక నెలవారీ కరెంట్ బిల్ మోత ఎలాగూ తప్పదు. వాడిన వాడికి వాడినంత బిల్లు. ఏసీ ఎంత కాస్ట్‌లీ యవ్వారమైనా వాడక తప్పదు. కరెంట్ బిల్ బాధ పడలేక కొందరు కూలర్లతో సరిపెట్టుకుంటున్నారు. ఈ బాధలు, ఖర్చులు ఏమీ లేకుండా కొత్త ఏసీ వస్తే ఎంత బాగుంటుంది. యస్.. ఏసీ మేడ్ ఈజీ టెక్నాలజీ వచ్చేసింది. ఎవరైనా దాన్ని అందుకోవచ్చు.
గుజరాత్ ఔత్సాహిక శాస్త్రవేత్త ఒకరు కరెంట్ అవసరం లేని ఏసీ తయారు చేశాడు. గుజరాత్ వదోదరలో డిజైన్ స్టూడియో నిర్వహిస్తున్న మనోజ్‌పటేల్ కేవలం 800 రూపాయలతో కరెంట్ అవసరం లేని మినీ ఏసీ తయారు చేశాడు. మట్టికుండలో నీరు చల్లగా ఎలా అవుతుందో అదే టెక్నాలజీ దీనికి ఉపయోగించాడు. మట్టికుండకు ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళే నీరు ఆవిరి కావడం వల్లే దానికి చల్లదనం వస్తుంది. సేమ్ టు సేమ్ అదే ఆలోచనతో మనోజ్‌పటేల్ పింగాణి ఉపయోగించి చిన్న ఏసీలు తయారుచేశాడు.
ఆఫీసులు, ఇళ్ళలో వాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. గది ఉష్ణోగ్రతను 32 నుంచి 23 డిగ్రీల వరకు తీసుకురాగల ఈ ఏసీలకు కరెంట్ అవసరమే ఉండదు. వ్యక్తిగత పింగాణి ఏసీ మోడల్లో ఒక ఎగ్జాస్ట్ ఫాన్ ఉంటుంది. ఒకసారి ట్యాంక్ నింపితే 10-12 రోజుల వరకు ఆ నీటినే వాడుకునే అవకాశం ఉంది. పింగాణి, రాళ్ళు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు చాలా తక్కువ. ఇక చవక ఏసీలు అందరూ వాడేయవచ్చు.