రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మందిని పెళ్లి చేసుకొని పక్కపక్క వీధుల్లో కాపురం పెట్టిన ప్రబుద్ధుడ్ని ఎట్టకేలకు పోలీసుల అరెస్ట్ చేశారు. శివశంకర్ పై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయి.
శివశంకర్‌ను అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు రోడ్డెక్కడంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు, అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసి, ఆ యువతి నుంచి 35 లక్షలు శివశంకర్ వసూలు చేసాడని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రాలోని గుంటూరు బేతంపూడికి చెందిన అడపా శివశంకర్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మందిని ఒకరికి తెలియకుండా మరొకరినిపెళ్లి చేసుకొని యువతులను మోసం చేశాడు. పెళ్లికి విడాకులు అయిన యువతులనే టార్గెట్ చేశాడు.
అది కూడా వివాహ పరిచయ వేదికే అతడి మార్గం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా పెద్ద కంపెనీలో పని చేస్తానని డే అండ్ నైట్ డ్యూటీలు ఉంటాయని ఒకరి కళ్లుగప్పి ఇంకొకరి దగ్గర కు వెళ్తూ కాలం గడుపుతూ వస్తున్నాడు.
పెళ్లి చేసుకొని వారందరిని ఎక్కడో ఉంచడం కాదు. పక్కపక్క వీధుల్లోనే ఉంచేవాడు. అయితే శివశంకర్ మోసానికి బలైన ఇద్దరు యువతులు జులై 14న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఈ నిత్య పెళ్లి కొడుకు బాగోతాన్నిబయటపెట్టారు.
శివశంకర్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.