నిన్నటికినిన్న జీవిత రాజశేఖర్ పై జరిగిన వివాదం గురించి చూశాం. తనకు 65 లక్షలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి, కోర్టులో కేసు వేశాడు. అదింకా నలుగుతోంది. ఇప్పుడు ఇదే తరహా కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కుకున్నారు. ఈ సారి మేటర్ 56 లక్షలు. కేసు వేసిన వ్యక్తి పేరు శేఖర్ రాజు.
హైదరాబాద్ కు చెందిన శేఖర్ రాజు, రామ్ గోపాల్ వర్మ కు 56 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారట. దిశ సినిమా టైమ్ లో ఈ మొత్తాన్ని వర్మకు అందించినట్టు చెబుతున్నారు రాజు. అయితే ఇన్నాళ్లయినా వర్మ తనకు తిరిగి డబ్బు చెల్లించలేదని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ కోర్టులో కేసు వేశారు రాజు. కోర్టు ఆదేశాల మేరకు రామ్ గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది. 406, 417, 506 సెక్షన్ల కింద ఆర్జీవీపై కేసు ఫైల్ చేశారు.
దీనిపై రామ్ గోపాల్ వర్మ ఇంకా స్పందించలేదు. ఆయన డేంజరస్ అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నైనా గంగూలీ, అప్సర రాణి ట్వీట్లు, ఫొటోలతో హంగామా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత లేడీ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన మరో సినిమా పని ప్రారంభించబోతున్నారు.