దేశంలో నకిలీ మందులకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. మెడిసిన్స్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఉండేలా కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ కోడ్ ఆధారంగా ఆ మెడిసిన్ ఒరిజినలా.. లేదా నకిలీదా అని సులభంగా గుర్తించవచ్చు.
దీని ద్వారా నకిలీ మందుల చెలామణి ఆగిపోతుంది. అంటే వివిధ రకాల ఔషధాలు తయారు చేసే కంపెనీలు ఇకపై ఆ మందులపై క్యూ ఆర్ కోడ్ లేదా బార్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలి. అలాగని అన్ని మెడిసిన్స్‌పై కోడ్ ఉండక్కర్లేదు. కేంద్రం గుర్తించిన కొన్ని అత్యవసరమైన 300 మెడిసిన్స్ విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తిస్తుంది.
ఎక్కువగా వాడే, ఖరీదైన, నకిలీ మందులకు అవకాశం ఉన్న ఔషధాలు ఈ జాబితాలో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 35 శాతం మందులు నకిలీవేనట. వీటిలో కొన్ని విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఈ అంశంపై అమెరికా కూడా ఒక నివేదిక తయారు చేసింది.
దీని ప్రకారం.. దేశంలో అనేక రకాల మందులు నకిలీవి తయారవుతున్నాయి.అందుకే వీటిని అరికట్టాలంటే క్యూ ఆర్ కోడ్ టెక్నాలజీ అవసరం అని అమెరికా 2019లో సూచించింది. అప్పట్నుంచి ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. గత జూన్‌లోనే వివిధ ఔషధ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కోడ్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ కోడ్ ద్వారా ఔషధం పేరు, ఫార్ములా, కంపెనీ, ఎక్స్‌పైరీ, మ్యానుఫాక్చరింగ్ డేట్ వంటి విషయాలు తెలుసుకోవచ్చు.క్యూఆర్ కోడ్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి వినియోగదారులు ఈ విషయాలు తెలుసుకోవచ్చు. మొదటి దశలో కీలకమైన ఔషధాల్ని మాత్రమే ఈ పద్ధతిలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత అన్ని ఔషధాలకు వర్తింపజేస్తారు.