ఎన్నికల సమయంలో చాలా సార్లు ఫేక్ న్యూస్ ఓటర్లను అయోమయానికి గురి చేస్తుంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం వినూత్న ఆలోచనతో ముందుకు వస్తోంది. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీలను నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
ఈ సందర్బంగా మాటాడిన ఆయన ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలను నివారించేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గతంలో ఈవీఎంలను ఓటర్ల వద్దకే తీసుకువెళ్లి వారి ఇండ్లల్లోనే ఓట్లు వేయిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అయింది.
ఓ అపార్ట్ మెంట్‌లో సీనియర్ సిటిజన్ ఓటు వేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. దీనిపై ఈసీ విచారణ జరిపింది. ఆ వీడియో ఫేక్ అని, ఏకాంత ప్రదేశంలో దాన్ని చిత్రీకరించారని పేర్కొంది. ఈ క్రమంలో ఫేక్ న్యూస్ వల్ల ఓటర్లు ప్రభావితం కాకుండా మరింత పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఈసీఐ పేర్కొంది.
పోలింగ్ బూత్ లల్లో ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ కంపార్ట్ మెంట్ లల్లో అసెంబ్లీ, పోలింగ్ బూత్ నంబర్‌లతో కూడిన స్టిక్కర్లు ఉంచుతామని పేర్కొన్నారు. దీంతో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేసినా అది నకిలీదా లేదా కాదా అని సులువుగా గుర్తించవచ్చన్నారు.
ఒక వేళ నిజంగానే తప్పుడు ఓటింగ్ జరిగినట్టు తేలితే ఈ విధానంతో అది ఎక్కడ జరిగింది అనేది సులువుగా గుర్తించవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ మేరకు త్వరలోనే నిర్ణయాన్ని అమలు చేస్తామని ఈసీఐ వెల్లడించింది.