విప్లవ యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా కలకత్తా నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తే ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆహ్వానం పలికారు.
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొనున్నట్లు సమాచారం. అయితే అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా దేశాలు క్యూబాకు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగానే క్యూబాకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సభకు వీరు విచ్చేశారు.
క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ,సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లు రవి వివిధ పార్టీల నాయకులు పాల్గొంటారు. ఇక ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా,ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్ కు వెళ్లనున్నారు.
వీరి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ జరిగే రవీంద్రభారతి వద్ద పలు చోట్ల ఫ్లెక్సీలు,కటౌట్లు వెలిశాయి. చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు,మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.