హైదరాబాద్ లోని అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాజ్ గంజ్ మొగారం బస్తికి చెందిన భరత్ బట్టర్.. గత కొంత కాలంగా గిరిరాజ్ కంపెనీతో కలిసి కెమికల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన దుకాణంలో డేట్ దాటిపోయిన కెమికల్ ను దుకాణం పక్కనే ఉన్న మ్యాన్ హోల్ లో పోస్తుండే వాడు.
అలవాటులో భాగంగానే శనివారం అలాంటి కెమికల్ నే మ్యాన్ హోల్ పోసాడు భరత్. భరత్ పోసిన కెమికల్ మ్యాన్ హోల్ లో లోపలికి వెళ్ళకపోవడంతో.. ఇనుప రాడ్డుతో కదిలించి పైనుండి నీటిని పోసాడు. దీంతో ఒక్కసారిగా ఆ మ్యాన్ హోల్ నుండి పెద్ద శబ్దంతో బ్లాస్టింగ్ జరిగింది. అక్కడే ఉన్న భరత్ బ్లాస్టింగ్ దాటికి రెండు అంతస్తుల పైకి ఎగిరి కింద పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
దుకాణంలో ఉన్న భరత్ తండ్రి వేణు గోపాల్ తోపాటు.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా శబ్దంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. భరత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisements
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అప్జల్ గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం బ్లాస్టింగ్ కి సంబంధించిన రసాయనాలను స్వీకరించి.. ఎఫ్ సీఎల్ ల్యాబ్ కు పంపించింది. దీంతో మహరాజ్ గంజ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.