లెబనాన్ రాజధాని బీరుట్‌లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు సృష్టించిన బీభత్సం గుర్తుంది కదా… వందకుపైగా మందిని పొట్టనబెట్టుకొని.. వేలాది మందిని ఆస్పత్రుల పాలు చేసింది. అణుబాంబును తలపించేలా జరిగిన ఆ పేలుళ్ల దృశ్యాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. ఇన్నాళ్లు చావును పక్కనపెట్టుకొని ఎలా బతికారోనని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడలాంటి ప్రమాదమే హైదరాబాద్‌కు పొంచి ఉంది.
చెన్నై మనాలిలో ఇన్నాళ్లు నిల్వ ఉన్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌లో నుంచి 181 టన్నులు హైదరాబాద్‌కు తరలివస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి దీన్ని కోనుగోలు చేయడంతో కస్టమ్స్ అధికారులు దాన్ని కంటెయినర్లలో నగరానికి తీసుకొస్తున్నారు. పెట్రోలియం పేలుడు, భద్రతా సంస్థ (Petroleum and Explosives Safety Organisation) సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకొని.. హైదరాబాద్‌కు రవాణా చేస్తునట్టు వారు చెప్తున్నారు. మూడు రోజుల్లో పది కంటైనర్లలో నగరానికి ఇది చేరుకుంటుందని వారు అంటున్నారు. లెబనాన్ పేలుళ్ల దృశ్యాలు చూసిన నగరవాసులు.. ఇప్పుడీ విషయం తెలిసి భయంతో వణికిపోతున్నారు. అన్నీ తెలిసి హైదరాబాద్ గుండెలపై ఎలా తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
2015లో దక్షిణ కొరియా నుంచి చెన్నైకి చెందిన ఓ వ్యాపార సంస్థ.. మొత్తం 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంది. అయితే అనుమతి లేకుండా దిగుమతి చేసుకున్నారని.. కస్టమ్స్ అధికారులు దాన్ని సీజ్ చేశారు. అక్కడే 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు. అప్పటి నుంచి ఇది అక్కడే ఉంటోంది. అయితే ఇటీవల లెబనాన్‌లో పేలుడు సంభవించడంతో.. అందరి దృష్టి దీని మీద పడింది. వెంటనే నిల్వ ఉన్న ఆ పదార్థాన్ని డిస్పోజ్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తతాయి. అయితే ఒకేచోట దాన్ని డిస్పోజ్ చేయడం ఎందుకనుకున్నారో ఏమో…ఆ ప్రమాదాన్ని ఇతర ప్రాంతాలకూ పంచేందుకు సిద్ధమయ్యారు అధికారులు