ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. ముంబైతో పోరులో ఓటమి చవిచూసిన చెన్నై.. ఫ్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. ఐదు సార్లు కప్పు గెలిచిన ఛాంపియన్ ముంబై ఇండియన్ ఇంతకు ముందే ప్లే ఆఫ్స్ ఆశలను చేజార్చుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన స్కోరింగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో ముంబై వెళ్తూవెళ్తూ చెన్నైని కూడా వెంటపెట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. చెన్నై జట్టుకు ఏ మూలో మిణుకుమిణకుమంటున్న ప్లే ఆఫ్స్ అవకాశాలను చిదిమేసింది ముంబై. తొలుత ముంబై బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ముంబై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
98 పరుగుల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత నిలదొక్కుకున్న ముంబై అలవోకగా విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (6), డేనియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) విఫలం కాగా… కెప్టెన్ రోహిత్ శర్మ (18) పేలవ ఫామ్ మరోమారు కొనసాగింది. హృతిక్ షాకన్ 18, టిమ్ డేవిడ్ 16 (నాటౌట్) పరుగులు చేశారు. తిలక్ వర్మ 34 (నాటౌట్) పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరికి మూడు వికెట్లు దక్కాయి.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. అందులో ముగ్గురు డకౌట్ అయ్యారు. రాబిన్ ఉతప్ప 10, శివం దూబే 10, బ్రావో 12 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ముంబై బౌలర్ డేనియల్ శామ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మెరిడిత్, కుమార్ కార్తికేయ లు చెరో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించినప్పటికి పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉంది. ఓడిన చెన్నై స్థానం కూడా మారలేదు. ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. ఇప్పుడు చెన్నైని కూడా తనతోపాటు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటె.. ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ఏ టీమ్ పై చెయ్ సాధిస్తుందోనని క్రికెట్ అభిమానులో ఆసక్తి మొదలైంది.