చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ గుర్తించింది. చంద్రని ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్లి కుప్పకూలిన ల్యాండర్ శకలాలను నాసా కనుగొంది. విక్రమ్ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది. ఆ చిత్రాలను తీసి పంపింది. విక్రమ్ శకలాలు దాదాపు 24 ప్రదేశాల్లో పడి ఉన్నాయని… షణ్ముగా సుబ్రహ్మణియన్ అనే ఇంజనీర్ విక్రమ్ కు సంబంధించిన తొలి శకలాన్ని గుర్తించినట్టు నాసా మూన్ మిషన్ ప్రకటించింది. విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 కిలో మీటర్ల దూరంలో శకలాన్ని సుబ్రహ్మణియన్ గుర్తించినట్టు నాసా తెలిపింది. అక్టోబర్ 14,15 నవంబర్ 11 న ఈ చిత్రాలను తీసినట్టు దృవీకరించింది. సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సంబంధాలు కోల్పోయాయి. దీనికి కారణాలు కనుగొనేందుకు ఇస్రోతో పాటు నాసా కూడా ప్రయత్నించింది. ల్యాండర్ వైఫల్యానికి సాఫ్టవేర్ సమస్యే కారణమని ఇస్రో తేల్చింది.
చెన్నైకి చెందిన 33 ఏళ్ల యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రహ్మణియన్ చంద్రుని ఉపరితలంపై కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ ను తాను కనుగొంటానని ఇస్రో, నాసాకు లేఖ రాశారు. అయితే అతని లేఖను ఇస్రో పట్టించుకోలేదు. ల్యాండర్ కనుగొనడానికి నాసా అతనికి అవకాశం కల్పించింది. రోజు 7 గంటలు ల్యాప్ టాప్ లో ల్యాండర్ శకలాలను కనుగొనేందుకు కష్టపడేవాడినని అని తెలిపారు. ఇస్రో తనకు అవకాశం ఇవ్వనందుకు బాధపడ్డానన్నారు. సుబ్రహ్మణియన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ‘ఐ ఫౌండ్ విక్రమ్ ల్యాండర్’ అని రాసుకున్నారు.