భారత పర్యటనకు రానున్న ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో గ్రౌండ్ కు ప్రేక్షకులను అనుమతిస్తారన్న ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 5 నుండి జరిగే తొలి టెస్టు నుండి 25-50శాతం ప్రేక్షకులతో మ్యాచ్ లు జరుగుతాయని అంతా భావించారు. కానీ ప్రేక్షకుల ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది.
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లోనే చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ సాగుతుందని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎస్ రామసామి తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
కరోనా నేపథ్యంలో ఏ చిన్న అలసత్వం వహించినా ఆటగాళ్ల భద్రతలో రిస్క్ అవుతుందని, అందుకే క్లోజ్ డోర్స్ మధ్యే మ్యాచుల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వర్గాలంటున్నాయి. ఈ నెల 27న భారత్, ఇంగ్లండ్ జట్లు చెన్నై చేరుకుంటాయి. బయో బబుల్‌లోకి వెళ్లడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5 నుండి టెస్టు ప్రారంభం అవుతుంది.