బ్యాంకింగ్ వ్యవస్థలో వినియోగదారులు మోసాల బారిన పడకుండా ఉండేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే ఎన్నో సదుపాయాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే పాజిటివ్ పే సిస్టమ్‌ను కూడా ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. అయితే దీన్ని ఇంకా అమలు చేయడం లేదు. కానీ జనవరి 1, 2021 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని RBI తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్‌బీఐ అమలు చేయనున్న పాజిటివ్ పే సిస్టమ్ వల్ల చెక్కుల ద్వారా జరిగే మోసాలు నిరోధించబడతాయి. రూ.50వేలు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులకు పేమెంట్లు చేసేటప్పుడు వివరాలను మరొకసారి కన్‌ఫాం చేసుకుంటారు. దీంతో చెక్కుల ద్వారా జరిగే మోసాలను అరికట్టవచ్చు. ఈ విధానాన్ని నూతన సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయాలని ఆర్‌బీఐ ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.
అయితే పాజిటివ్ పే సిస్టమ్ కావాలా, వద్దా అనేది వినియోగదారుల ఇష్టం మేరకు వదిలేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అంటే వినియోగదారుడు తాను కోరుకుంటే ఈ సిస్టమ్‌ను బ్యాంకులు అమలు చేయాలి. ఆ సదుపాయాన్ని కస్టమర్‌కు అందించాలి. లేదంటే ఇవ్వకూడదు. అదన్నమాట. అయితే ఈ విధానం ద్వారా కస్టమర్లు ఎవరికైనా చెక్కులను ఇస్తే అందుకు సంబంధించిన వివరాలను బ్యాంకుకు ముందుగానే తెలియజేస్తారు. బ్యాంకులు చెక్కులను ప్రాసెస్ చేసే సమయంలో కస్టమర్ అందించిన వివరాలు, చెక్కుపై ఉన్న వివరాలు కరెక్టేనా, కాదా.. అని పోల్చి చూస్తారు. ఏమైనా తేడాలు ఉంటే వెంటనే బ్యాంకు సిబ్బంది కస్టమర్‌కు తెలియజేస్తారు. అలాగే అలాంటి చెక్కులను వారు రిజెక్ట్ చేస్తారు. ఇలా చెక్కుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు వీలుంటుంది.
కాగా ఈ విధానం ద్వారా కస్టమర్ ఎలక్ట్రానిక్ రూపంలో చెక్కు వివరాలను బ్యాంకుకు తెలియజేస్తాడు. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్ లేదా ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా వివరాలను తెలియజేస్తాడు. చెక్కుపై తేదీ, ఎవరి పేరిట ఇచ్చింది, మొత్తం ఎంత.. తదితర వివరాలు అందులో ఉంటాయి. వాటిని పోల్చి చూశాకే బ్యాంకులు చెక్కులను ప్రాసెస్ చేస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) దేశంలోని అన్ని బ్యాంకులు పాజిటివ్ పే సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.