– మతి ఉండే మాట్లాడుతున్నారా?
– నయీం లాంటి వాడే ఏం చేయలేకపోయాడు..
– వెంకట్ రెడ్డి ఎంత..? ఏం చేస్తారు?
– ప్రజల దృష్టిలో మీరు డక్ ఔట్ వికెట్
– వెంకట్ రెడ్డికి చెరుకు సుధాకర్ కౌంటర్
– పలుచోట్ల కోమటిరెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు
కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు సుధాకర్ ను తన అభిమానులు చంపేస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వివాదం కాంగ్రెస్ అధిష్టానం దాకా చేరింది. తన కుమారుడికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తిట్టడాన్ని చెరుకు సుధాకర్ సీరియస్ గా తీసుకున్నారు. ఆడియో టేపును టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫార్వర్డ్ చేశారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కామెంట్ చేయలేదని.. అయినా కూడా కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు సుధాకర్.
నయీమ్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే తనను ఏమీ చేయలేకయాడని.. కోమటిరెడ్డి ఏం చేస్తారని వ్యాఖ్యానించారు. ఆయన తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి డక్ ఔట్ అయిన వికెట్ అని విమర్శించారు. తనను అసభ్య పదజాలంతో తిట్టిన ఆడియో తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసిందని తెలిపారు.
ఇలాంటి వాళ్ల పెత్తనం పార్టీలో ఎన్ని రోజులు కొనసాగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు చెరుకు సుధాకర్. తాను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా అతను స్టార్ క్యాంపెనర్ గా ఉండి ఒకే పార్టీలో పని చేస్తున్న తనపై ఆ భాష ఏమిటో అర్థం కావట్లేదని అన్నారు. మతి ఉండి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండు అర్థం కావట్లేదని.. దీన్ని అంత తేలిగ్గా వదలనని హెచ్చరించారు.
మరోవైపు కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమనేత, బహుజన గౌడ బిడ్డ చెరుకు సుధాకర్ ను చంపుతారంటూ రౌడీ లాగా మాట్లాడిన తీరు సమంజసం కాదని అన్నారు. ఇటు నకిరేకల్ లో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద వెంకట్ రెడ్డి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు బీసీ విద్యార్ధి సంఘం నేతలు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఎంపీని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.