రియాల్టీ షో నటి ఉర్ఫి జావీద్ పై ఇటీవల ప్రముఖ రచయిత చేతన్ భగత్ ‘నోరు జారి’ ఆ తరువాత ఆమె ఇచ్చిన కౌంటర్ తో దాదాపు తన కామెంట్స్ ని వెనక్కి తీసుకున్నంత పని చేశారు. ఆమెపై తన వ్యాఖ్యలను మరో విధంగా మీడియా ఆపాదించిందన్నట్టుగా మాట్లాడారు. ఇటీవల ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న చేతన్ భగత్.. ఈ రోజుల్లో యువకులు ఉర్ఫి జావీద్ వంటివారు ధరించిన డ్రెస్సులు, వారి పోకడలపై ఎక్కువగా దృష్టి పెడుతూ.. తమ కెరీర్ ని, తమ చదువును పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ముఖ్యంగా మగ పిల్లల్లో చాలామంది ఇన్స్ టా గ్రామ్ లో అదేపనిగా గంటలతరబడి గడుపుతూ తమ విలువైన కాలాన్ని పాడు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఉర్ఫి జావీద్ ఎవరో అందరికీ తెలుసునని, ఆమె ఫొటోలతో మీరేం చేస్తారని, మీ పరీక్షల్లో లేదా మీరు హాజరయ్యే ఇంటర్వ్యూల్లో ఆమె ప్రమేయం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.
ఆమె ధరించే డ్రెస్సుల గురించి ఇంటర్వ్యూయర్ కి మీరు చెబుతారా అని కూడా అన్నారు. ఓ వైపు కార్గిల్ లో మన జవాన్లు మన దేశాన్ని రక్షిస్తుంటే.. మరోవైపు మన యువకులు ఉర్ఫి జావీద్ లాంటి వారి ఫోటోలను తమ బ్లాంకెట్లలో దాచుకుంటున్నారని చేతన్ భగత్ వ్యాఖ్యానించారు.
దీనిపై ఉర్ఫి తీవ్రంగా మండిపడుతూ అనవసరంగా మీరు తన పేరును ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. తాము చేసే పొరబాట్లను అంగీకరించకుండా చేతన్ భగత్ వంటి మగాళ్లు మహిళలను ఎప్పుడూ విమర్శిస్తుంటారని, అత్యాచార సంస్కృతిని రెచ్చగొట్టే పోకడను మానుకోవాలని ఆమె సూచించింది. మహిళలు ధరించే డ్రెస్సులు, పురుషుల ప్రవర్తన గురించి మీరు ఎప్పుడో పాతకాలం నాటి వ్యాఖ్యలు చేస్తున్నారని, మీ లాంటివారికి ఇలా మాట్లాడే హక్కు లేదని ఆమె నిప్పులు కక్కింది. 2018 లో మీటూ ఉద్యమ సమయంలో చేతన్ భగత్ పెట్టిన వివాదాస్పద వాట్సాప్ మెసేజుల స్క్రీన్ షాట్లను కూడా ఉర్ఫి తన ట్వీట్లకు జోడించింది. దాంతో భగత్.. తనపై వచ్చిన ఆరోపణలు ఫేక్ అంటూ.. ఇన్స్ టా గ్రామ్ పై అదేపనిగా గంటల తరబడి కూర్చుని మీ సమయం వృధా చేసుకోరాదని మాత్రమే తాను యువకులకు చెప్పానని, ఇందులో తప్పేమీ లేదని అన్నారు.