చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే కొందరికి చెమటలు పడతాయి. మరికొందరికి హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది. ఒంటికి ఆయిల్ పూసుకుని, చడ్డీలు మాత్రమే వేసుకుని, చేతిలో మారణాయుధాలను పట్టుకుని దొంగతనాలకు బయల్దేరుతుంటారు. ఇళ్లకు ఎంత గట్టి తాళాలు వేసినా సరే.. చిటికెలో పగలగొట్టి ఉన్నదంతా దోచుకెళ్తుంటారు. ఎవరైనా అడ్డొస్తే.. వారిపై క్రూరంగా దాడి చేస్తారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది చెడ్డీ గ్యాంగ్. దమ్ముంటే తమను పట్టుకోవాలని సవాల్ కూడా చేసింది. పోలీసులు రాష్ట్రాలు దాటి.. అనేక కష్టాలు పడి.. అహోరాత్రులు శ్రమించి.. ఎట్టకేలకు హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇక వారి పీడ విరగడయినట్టేనని అనుకుంటే.. తాజాగా మరో బ్యాచ్ నగరంలో చెలరేగిపోయింది.
కీసర పీఎస్ పరిధిలోని నాగారంలో తాజాగా చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. మూడు ఇళ్లలోకి చొరబడి 16 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయింది. ఏడు నుంచి ఎనిమిది మందితో కూడిన బ్యాచ్ అర్ధరాత్రి వీధుల వెంట తిరుగుతూ హల్‌చల్ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని.. తమ పని పూర్తి చేసుకుంది. చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన దృశ్యాలు పలుచోట్ల సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారి రాకను చూసి వీధి కుక్కలే భయపడిపారిపోతుండటం అందులో కనిపిస్తోంది. అంటే వారి ఆహార్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నందున.. శివారు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలిసుల హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు, అలారమ్‌లు, తలుపులకు దృఢమైన గడియలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.